Kasturi Vijayam

దేశాభివృద్ధిలో అవిభాజ్యమైన పాకనాటి వంశ చరిత్ర.

సుధీర్ రెడ్డి పామిరెడ్డి గారెవరు? ఆయన నాకెలా పరిచయమయ్యారు? ఆయన రాసిన ‘మాచెట్టునీడ (అసలేం జరిగింది) అనే ఈ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథానికి నన్నెందుకు ముందుమాట రాయమన్నారు? అనేవి పాఠకులతో ముందుగా ముచ్చటించుకోవాలి. హైదరాబాదులో 26 ఆగస్టు 2020 వ తేదీన జరుగుతున్న మదర్ థెరిసా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. నేను ప్రసంగిస్తున్న సమయంలోనే నాకొక తెలియని కొత్త నెంబరు నుండి ఫోన్ వచ్చింది. దాన్ని గమనించి నేను వెంటనే ఫోను కాల్ తీయలేదు. సాధారణంగా అలాంటి కాల్స్ నేను తీయను! వాళ్ళేదైనా మెసేజ్ పెట్టి వివరాలు రాస్తే దాన్ని బట్టి తీయాలో లేదో ఆలోచిస్తాను. కొన్ని సార్లు అప్రయత్నంగా కూడా తీసేస్తుంటాను. అలా మీటింగ్ లో ఉండగా రెండు మూడు సార్లు వచ్చిన ఫోన్ తీసి, బయటికొచ్చి, నా పరిస్థితిని చెప్పి, తర్వాత మళ్ళీ కాల్ చెయ్యమన్నాను. తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఆ నెంబరు నుండే ఫోన్ చేసి తన పేరు సుధీర్ రెడ్డి పామిరెడ్డి అని తనని పరిచయం చేసుకుని, తన పరిశోధన కోసం దాసు శ్రీరాములు గారి వివరాలు కావాలన్నారు. తాను మలేషియాలో ఉంటున్న తెలుగు వాడినని వివరించారు. పరిశోధకుడిగా తాను సేకరించాల్సిన సమాచారం ఏ మాత్రం దొరుకుతుందన్నా దాన్ని వెతికి పట్టుకోవాలి. ఆ లక్షణాన్ని ఈ సందర్భంలో సుధీర్ రెడ్డిగారిలో గమనించాను. దాసు శ్రీరాములు గారి జీవితం, సాహిత్య కృషి గురించి గతంలో (14 ఫిబ్రవరి 2014) మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో నేనొక జాతీయ సదస్సు నిర్వహించాను. ఆ వివరాలు ఇంటర్నెట్ లో చూసి నన్ను సంప్రదించానని ఆయన అన్నారు. దాసు శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్లో నాకు తెలిసిన డా.అచ్యుతరావు గారి వివరాలు చెప్పాను. తర్వాత అప్పుడప్పుడూ తానే ఫోన్ చేసి తన పరిశోధన వివరాలు చెప్తుండేవారు. నా బ్లాగు తాను చదివానని, దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతానని, దానిలోని అనేక విషయాల్ని నాతో చర్చించేవారు. తన వంశం గురించి పరిశోధన చేస్తున్నానని చెప్పేవారు. ఆయనతో సంభాషించేటప్పుడు ఆయన వృత్తి రీత్యా తెలుగు భాష, సాహిత్య శాఖల్లో లేరని అనిపించింది. కానీ, ఆయన మాటల్లో సాహిత్యం పట్ల గాఢమైన అనుబంధం ఉందని తెలిసింది. విస్తృతమైన అధ్యయనం చేస్తున్నారని గమనించాను. సామాజిక సమస్యల పరిష్కారానికి సాహిత్యాన్ని కూడా ఒక బలమైన సాధన40గా వాడుకోవాలనే ఆకాంక్ష ఆయన మాటల్లో వ్యక్తమవుతుందనిపించేది. ఇటువంటివారి వల్లనే సాహిత్యానికి కూడా సాహిత్యేతర శాస్త్రాలతో కలిసి అధ్యయనం చేయాల్సిన పద్ధతులు చాలా మందికి పరిచయం అవుతాయనిపించింది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా సురవరం ప్రతాపరెడ్డిగారు తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చరిత్ర, సంస్కృతుల అధ్యయనాన్ని చేశారు. ఆ తర్వాత మార్క్సిస్టు ప్రభావంతో వచ్చిన రచనల్లో ఈ పద్దతి కనిపించడం విస్తృతమైంది. మరలా అటువంటి ఒక రచనను సుధీర్ రెడ్డి పామిరెడ్డి గారి నుండి వచ్చిందనిపిస్తుంది. ఆ గ్రంథమే ‘మాచెట్టునీడ (అసలేం జరిగింది). సుధీర్ రెడ్డి గారితో సంభాషిస్తున్నప్పుడు ఆయనలో దళితుల పట్ల కేవలం సానుభూతి మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన అనేక కోణాల్ని ఎంతో అభ్యుదయంగా విశ్లేషిస్తున్నట్లనిపించేది. చరిత్రలోను, సాహిత్య చరిత్రలోను దళితుల్ని మరికొన్ని కులాల్ని తక్కువ చేసి రాయడం లేదా ఇవ్వవలసినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా చేశారనే అనేకాంశాలు ఆయన మాటల్లో నాకు ధ్వనించేవి. ఆ వక్రీకరణ చరిత్ర పట్ల ఆయనకు వ్యతిరేకత ఉంది. వాస్తవాల్ని వాస్తవంగా చెప్పాలనే కుతూహలం ఉంది. అది అంతా తన వంశీయుల చరిత్రతో కలిపి చెప్పాలనే తపన ఈ గ్రంథంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. చరిత్ర రచనలోను, సాహిత్య మూల్యాంకనంలోను, రాజకీయ శాస్త్రాల్ని విశ్లేషించడంలోను, ఆర్థికాంశాలకు మూలమైన ప్రాజెక్టుల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. సాహిత్యానికి సంబంధించిన అంశాలు కేవలం సాహిత్యం వరకే కాకుండా అనేక శాస్త్రాలతో సమన్వయం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించడంలోను, దళితులు, ఆదివాసుల ఆలోచనల్ని విశ్లేషించడంలోను నా అభిప్రాయాలకు ఎంతో దగ్గరగా ఉండడం వల్ల నాచేత కూడా ముందుమాట రాయిస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పయనంలో అధికారం, పీడన, దానికి దాసోహమైన వాళ్ళు, దాసోహం కాకుండా తిరగబడిన వాళ్ళు…ఆ సందర్భంగా జరిగే కుట్రలు, కుతంత్రాల వల్ల ప్రజల వలసలు, ఆ ప్రజలు మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి దీర్ఘకాలిక ఆలోచనలతో చెఱువులు తవ్వించి, భూమిని బంగారం చేసిన వంశం పాకనాటి వారిది. ఆ చెఱువుల నిర్మాణం జీవితానుభవాలనుండి, శ్రమైక జీవన శక్తినుండి భూమి పుత్రుల ఉత్పత్తి సామర్థ్యం నుండి వచ్చింది. అదే ఆలోచన తర్వాత కాలంలో విద్యావంతులు, మేధావుల్లో శాస్త్ర, సాంకేతిక సామర్థ్యంగా ప్రతిఫలించి ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజి రూపొందింది. అదే దార్శనికత, ఆ వ్యవస్థీకృత ప్రయోజనమే అనేక బృహత్ ప్రాజెక్టుల రూపకల్పనగా కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు రూపకల్పనకూడా అటువంటిదే. దీనిలో టంగుటూరి అంజయ్య గారి కృషిని చెప్పడం చరిత్ర విస్మరించిన అంశాల్ని బహిర్గతం చేసే గొప్ప ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. అంతేకాదు, టంగుటూరి అంజయ్యగారు ‘రెడ్డి’ అని చాలామందికి తెలియదు. కానీ, అంజయ్యగారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను రెడ్డి నని చెప్పుకున్నారు. దానికి గల కారణాలన్నీ ఈ చరిత్ర గ్రంథంలో సుధీర్ రెడ్డిగారు సవివరంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది అంజయ్యగారేనని ఈ చరిత్ర పరిశోధన గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిశోధన గ్రంథం ‘మాచెట్టునీడ (అసలేం జరిగింది) లక్ష్యమేమిటని ఆలోచిస్తే, రచయిత సుధీర్ రెడ్డి పామిరెడ్డిగారు బ్రిటిష్ పాలకులు లేదా పరాయి దేశ పాలకులు రాకముందే భూమి పుత్రుల స్వేచ్చ, శక్తి సామర్థ్యాలను నిరూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పాకనాటి వంశీయుల చరిత్రను విస్మరించారనిదని, భారతదేశంతోను, దానిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోను తమకున్న అనుబంధాన్ని, అవిభాజ్యతను సాంస్కృతిక, రాజకీయ, ఆర్థికాంశాలతో ముడిపడిన ఒక పరిణామాన్ని సిద్ధాంతీకరించే ప్రయత్నం ఈ పరిశోధనలో ప్రతి వాక్యంలోనూ ప్రతిఫలిస్తుంది.

ఈ పుస్తకంలో భారతీయసమాజాన్ని, ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల పరిణామవికాసాలు వినూత్న కోణంతో ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇది ఒక కథలా అనిపిస్తుంది. ఇది ఒక రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంలా అనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి వనరుల వినియోగానికి సంబంధించిన అన్వేషణ కనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల చరిత్రను కేంద్రంగా చేసుకుని చేసిన పరిశోధన గ్రంథంలా అనిపిస్తుంది. ఇది చదువుతూ ఉంటే స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. ఇది చదివితే దేశ చరిత్ర తెలుస్తుంది. ఇది చదివితే దేశ చరిత్ర అభివృద్ధిలో భాగం అయిన వ్యక్తుల పాత్ర తెలుస్తోంది. పాఠకులు తమ వంశంవాళ్ళ చరిత్ర రాసుకోవాలనే ఆలోచనని రేకెత్తిస్తుంది. ఇన్ని రకాలుగా రాసిన ఈ పుస్తకం సుధీర్ రెడ్డి గారిని లోతైన ఆలోచనలు విస్తృతమైన పరిశోధనకు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకనే తమకి కావలసినవాటిని తాము గ్రహిస్తూనే ఉందనే గుర్తించాల్సిందేదో సూచనామాత్రంగా అనిపించేటట్లు చేయగలగడమే ఈ పరిశోధనా నిర్మాణంలో ఉన్న ఒక వ్యూహమనుకుంటున్నాను. దీన్ని గుర్తించకపోతే, గజిబిజిగా ఉందనిపిస్తుంది. తానేమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని సూటిగా చెప్పవచ్చుకదా అనిపిస్తుంది. ఈ పుస్తకం ప్రపంచం దృష్టిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రచనావిధానం బాగుంటుందో పాఠకులే నిర్ణయిస్తారు. సుధీర్ రెడ్డి పామిరెడ్డి గారి అన్వేషణను, ఆయనకున్న నీటిపారుదల వ్యవస్థమీద ఉన్న అవగాహనను ఈ గ్రంథం మనకళ్ళముందుంచుంది. భారతదేశ చరిత్రను, దానిలో అంతర్భాగంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రను, దాన్ని అంతర్భాగంగా చేసుకొని రాజకీయ శాస్త్రాన్ని వివరిస్తూనే, దాని అంతర్భాగంగా అవిభాజ్యమైన వారి చరిత్రను అవగాహన చేయించే ప్రయత్నం చేసిన రచయిత, పరిశోధకుడు సుధీర్ రెడ్డి పామిరెడ్డిగారిని అభినందిస్తున్నాను.

RELATED ARTICLES

మీరు కుకీస్‌ను అంగీకరిస్తే మాకు తెలియచేయండి